మహా శిఖరం
అమ్మవొడి వీడి
బుడి బుడి నడకల్లో
నా చిరు పాదాలు కందకుండా
మట్టి మాలిన్యం తాకకుండా
నీ లావన్యమైన అరచేతి పొత్తిళ్ళకు
ముండ్లు బొడిగెరాళ్ళు పల్గులేర్లు గుచ్చినా వోర్చుకొని
నా కేరింతలకు, ఇంకా ప్రోత్సహిస్తూ
మొదటి అడుగుల అరంగేట్రం చేయించిన
ఆదిగురు మా నాన్న!
ఏనుగు అంబారిలా
గుర్రం సవారిలా
నడివీపున నన్ను మోస్తు
చల్చల్ గుర్రం చలాకి గుర్రమంటు మోకాళ్ళపై పాకుతూ
పైపైకి ఎగిరేస్తూ సంబురపెట్టి
లెక్కలేనన్ని మహా యుద్ధాలు గెలిపించిన
క్రమశిక్షణ కాంతి శిఖరం మా నాన్న!
తన హృదయ వాకిలి తోటలో
క్రీడామైదానం లో ఆటలు
నా యిష్టమొచ్చినంత సేపు ఆడినా
నా యిష్టమొచ్చిన పాట పాడినా
వంతపాడి నాతో సరీ ఆడే
దిగాంత కీర్తి పతాక మా నాన్న!
నాన్న!
నీ శ్రమ చెమట ఊటలో తడిసి,
నడుం మడికట్ట లుంగీలో చెక్కిన రూపాయి
నా చేతిలో కోటి కాంతులతో వెలిగి
దుఖానం గల్లపెట్టెలో ఘల్లు మని
నా నోట్టో నారిజ మిఠాయై
ఉవ్విళ్ళూరిన మధుర క్షణాలు
ఇంకా నా హృదయ పుస్తక పుటల్లో
భద్రంగా దాచుకొన్న.
ఉట్టిమీది అటికెలో మెతుకు దొరకనప్పుడు
గిద్దెడు వడ్లకు కొన్న పేలపుండ
ఆకలి తీర్చినపుడు
నా కళ్ళలో
ఆనందం చూసి
తనివి తీర కౌగిల్లో బంధించి
గట్టిగా ముద్దాడి
ఆనంద సాగరంలో తేలాడే తెప్ప మా నాన్న!
నాన్న! బుజాలపై ఎక్కి మేఘాలను నిమిరి
తొలి పొద్దును ముద్దాడేవాడిని.
గాలిలో ఎగిరేసి పట్టుకుని,
అంతులేని బలాన్నిచ్చే
జ్ఞాపకాల పూదోట పరిమల భరితం
నా జీవన పర్యంతం నాన సుమధుర చరితం.
గడక తినే గడ్డురోజుల్లో
మెతుకుల బువ్వకై
ఇర్స వడ్లకు జీతముండి
వడ్ల బువ్వతో
నా కడుపు నింపిన
నాన్న! నీవు పస్తులుంటివి.
ఆ కట్టెకోత మా గుండెకోతై
నక్సల్ల బాంబును,
పోలీసులు నీపై విసిరిన
అనుదినం
నీ జ్ఞాపకాల వరద
గోదారి పరవళ్ళుతోక్కి
సాగరాన్ని తాకి
మేఘమై వర్షిస్తూన్నది ప్రతియేడు.
రచన తేది.19.10.2017
No comments:
Post a Comment