Saturday, 27 December 2025

రుబాయి

యుద్దంలో వీరుడెపుడు వెన్ను చూపరాదు
ఆయువు ఉన్నంతవరకు గన్ను వీడరాదు
ప్రాణం పోయిన సరే, మన్ను వదలరాదు
మృత్యువు నిన్నంటి వున్న కన్నుమూయరాదు   

Tuesday, 3 December 2024

గౙల్ : నా మది పిచ్చిదై నా హృది

నా మది పిచ్చిదై నా హృది వ్యధచెందెను ఎందుకో
ఆ కానలోన ఎటుతోచలేక మృతిచెందెను ఎందుకో
పువ్వులలోని మెత్తదనం ఆ నవ్వులలోని కొత్తదనం
నీ మాటల పరిమల మాలికలు రొదచెందెను ఎందుకో
ఆ కానలోన ఎటుతోచలేక మృతిచెందెను ఎందుకో
నా మది పిచ్చిదై నా హృది వ్యధచెందెను ఎందుకో
ఎడారి నడకల చేదుదనం ఆ చిన్నారి పలుకుల తీయదనం
నీ చేతుల వొంపుల కరుకుదనంతో వధ చెందెను ఎందుకో
ఆ కానలోన ఎటుతోచలేక మృతిచెందెను ఎందుకో
నా మది పిచ్చిదై నా హృది వ్యధచెందెను ఎందుకో
ఉసిరి ప్రేమల వొగరుదనం ఆ కొసరి కవితల పొగరుదనం
నీ వయసు సొగసుల అరుగుదనంతో మతిచెందెను ఎందుకో
ఆ కానలోన ఎటుతోచలేక మృతిచెందెను ఎందుకో
నా మది పిచ్చిదై నా హృది వ్యధచెందెను ఎందుకో
జీవిత మజిలీ చివరి క్షణం ఓ ‘సాధు’ ప్రయాణపు తాపరణం
నీ అడుగుజాడల మట్టిదనంతో జతచెందెను ఎందుకో
ఆ కానలోన ఎటుతోచలేక మృతిచెందెను ఎందుకో
నా మది పిచ్చిదై నా హృది వ్యధచెందెను ఎందుకో
29/04/2019 1:50PM

గౙల్ : నన్ను తాకిన కథ ఒకటుంది

నన్ను తాకిన కథ ఒకటుంది వింటావా చెబుతా మరీ
 నా హృదయం పగిలిన కథ యది కంటావా చెబుతా మరీ
అడిగేరు సుమ నా మదిని అది తస్కరించినది ఎవరని
పూల చాటున ముల్లు కథని వింటావా చెబుతా మరీ
తేనె పూసిన కత్తులతో నా హృదిని కోసిన జ్ఞాపకం
తీయదనపు యా చేదు నిజం కథ వింటావా చెబుతా మరీ
మరుపురాని మధు వసంతం మెరుగులు లేని నిశి నా సొంతం
చిరు వలపుల ఆ వంచన‌ గల కథ వింటావా చెబుతా మరీ
యెవరిని పిలిచినా నీదు నామమే మదిలో పలికిన సంగతి
అడుగున తానై కదిలిన ఓ కథ వింటావా చెబుతా మరీ
నేనెవరో తెలిసనదిపుడే కదా నా నీడై కదిలిన తోడు
‘సాధు’ మనసును కుదిపిన ఓ కథ వింటావా చెబుతా మరీ
తేది. 19/10/2020 ఉ. 7:53

Friday, 20 September 2024

శీర్షక: మహా శిఖరం

శీర్షక: 
మహా శిఖరం అమ్మవొడి వీడి 
బుడి బుడి నడకల్లో 
నా చిరు పాదాలు కందకుండా 
మట్టి మాలిన్యం తాకకుండా 
నీ లావన్యమైన అరచేతి పొత్తిళ్ళకు 
ముండ్లు బొడిగెరాళ్ళు పల్గులేర్లు గుచ్చినా వోర్చుకొని 
నా కేరింతలకు, ఇంకా ప్రోత్సహిస్తూ 
మొదటి అడుగుల అరంగేట్రం చేయించిన ఆదిగురు మా నాన్న! 
ఏనుగు అంబారిలా గుర్రం సవారిలా 
నడివీపున నన్ను మోస్తు చల్చల్ గుర్రం చలాకి గుర్రమంటు మోకాళ్ళపై పాకుతూ 
పైపైకి ఎగిరేస్తూ సంబురపెట్టి 
లెక్కలేనన్ని మహా యుద్ధాలు గెలిపించిన క్రమశిక్షణ కాంతి శిఖరం మా నాన్న! 
తన హృదయ వాకిలి తోటలో క్రీడామైదానం లో ఆటలు 
నా యిష్టమొచ్చినంత సేపు ఆడినా 
నా యిష్టమొచ్చిన పాట పాడినా 
వంతపాడి నాతో సరీ ఆడే దిగాంత కీర్తి పతాక మా నాన్న! 
 నాన్న! నీ శ్రమ చెమట ఊటలో తడిసి, 
 నడుం మడికట్ట లుంగీలో చెక్కిన రూపాయి నా చేతిలో కోటి కాంతులతో వెలిగి 
దుఖానం గల్లపెట్టెలో ఘల్లు మని 
నా నోట్టో నారిజ మిఠాయై 
ఉవ్విళ్ళూరిన మధుర క్షణాలు 
ఇంకా నా హృదయ పుస్తక పుటల్లో భద్రంగా దాచుకొన్న. 
ఉట్టిమీది అటికెలో మెతుకు దొరకనప్పుడు గిద్దెడు వడ్లకు కొన్న పేలపుండ 
ఆకలి తీర్చినపుడు నా కళ్ళలో 
ఆనందం చూసి తనివి తీర కౌగిల్లో బంధించి గట్టిగా ముద్దాడి ఆనంద సాగరంలో తేలాడే తెప్ప మా నాన్న! 
నాన్న! బుజాలపై ఎక్కి మేఘాలను నిమిరి 
తొలి పొద్దును ముద్దాడేవాడిని. 
గాలిలో ఎగిరేసి పట్టుకుని, అంతులేని బలాన్నిచ్చే జ్ఞాపకాల పూదోట పరిమల భరితం నా జీవన పర్యంతం నాన సుమధుర చరితం. గడక తినే గడ్డురోజుల్లో మెతుకుల బువ్వకై ఇర్స వడ్లకు జీతముండి వడ్ల బువ్వతో 
నా కడుపు నింపిన నాన్న! నీవు పస్తులుంటివి. ఆ కట్టెకోత మా గుండెకోతై నక్సల్ల బాంబును, పోలీసులు నీపై విసిరిన అనుదినం 
నీ జ్ఞాపకాల వరద గోదారి పరవళ్ళుతోక్కి సాగరాన్ని తాకి మేఘమై వర్షిస్తూన్నది ప్రతియేడు. 

రచన తేది.19.10.2017

Thursday, 19 September 2024

ప్రశ్నించిన గొంతులను అననచేస్తే

ప్రశ్నించిన గొంతులను
అనచేస్తే
కోటి గొంతుకలొక్కటై
గర్జిస్తాయి, జాగ్రత్త !

వివేకవంతులెదిగితే
ఒదగాల్సి వస్తదేమోనని,
రౌడీ షీటర్ల కింద జమకట్టి,
బంధీలను చేస్తే !
సింహాలై గాండ్రిస్తే !
సుడిగాలి సునామీలో 
గల్లంతౌతారు జాగ్రత్త !

ఒక "ఆగిరిపల్లె"నేమి ?
భరత ఖండంలో,
ప్రతి పల్లెలో గిదే లొల్లి, 
ప్రతి గల్లీలో గిట్లనే గిట్లనే !

ఏందీ !
అంటరానోడు పైనుండద్దా?

గా సీట్లో ఓట్లల్ల గెల్సినా !
నీ పరిపాలన హుకుంలో
కట్టప్పలా కట్టుబానిసలు,
ప్రశ్నించరు, యెదురుతిర్గరు,
చవటల్లా, చోద్యంచూస్తారు,
రాజ్యాంగపు హక్కులను
అమ్ముకొనే పంచమ చంచాలు.

అధికార మధంపట్టిన
చట్టపు చుట్టాల 
అండ దండలతో,
కాపలా కుక్కలతో కరిపిస్తే, 
లాల్-నీలమై 
నిరసిస్తారు
కలిసొస్తారు.
జాగ్రత్త !

తేది: 10/06/2017

నా దేశం గొప్ప దేశం

 
నా దేశం గొప్ప దేశం 
పలువురికి అదర్శనీయం
ఎక్కడ పడితే అక్కడ ఊడ్వలేనంత చెత్త 
మోయలేనంత మోత, కూయలేనంత కూత
పొర్లలేనంత బురద, గోకలేనంత దురద,
దుమ్మూ దూళి మన్ను మశానం
మొసతీయలేని గాలి దుర్గంధ పరిమళ,  
పర్యావరణాన్ని పాడుచేసే ఫ్యాక్టరీలు,
అవసరానికి ఇతరుల ప్రాణాలకు కీడుచేసే
రసాయనిక మందుల ప్రయోగశాలలు 
ఎవరేమైపోతే నాకేంటి, నేను గొప్పగుండానే
నా దేశం గొప్ప దేశం 
           ****  
బహిరంగ మల మూత్ర విసర్జకావయవాలు,
చెత్త కుప్పల్లో బ్రూణ హత్యల బాలికల హృదయ రోదనలు, 
ఎలాగైనా బతకాలనే పీడితుల ఆవేధనలు,
భూమిమీద పుట్టిన మనిషికి కాస్తంత జాగలేని, 
హామీలిచ్చిన రాజ్యాధిపతుల కనీస జాడలేని,
సాటి మనిషిపై కాస్తంత జాలి లేని,
కనికరం లేని కసాయి మనుషులున్న 
 నా దేశం గొప్ప దేశం.
         ****  
ట్రాఫిక్ మ్యానర్లేని ట్రాఫిక్ బండ్ల మనుషులు,
లక్షల టన్నుల పొగ విసిరి పారేసే 
మిస్సైల్ మౌత్ సిగరెట్లు,
పదిలం లేని పర్యావరణం 
చెట్లు వీచని ఏసీ గాలులు, 
రిమోటులా మారిన మనుషుల తీరు అబ్బా, 
యెమని చెప్పాలి నా దేశం గొప్ప దేశం .

పశువుకు మనిషికి తేడా తెలియక 
శిశువులతో రమించే కామ పిశాచాలతో 
కలివిడి జీవిత ప్రయాణలో 
వంచనతో వాంచలు తీసుకొనే జంతు నరుల
కుల కంపు, మత పంకంలో బోర్లుతున్న పందులకు
విందులుతో, పొందులతో, చిందులేపిస్తున్న 
నవ ఆనాగరిక నడకలు నేర్చుకొంటున్న 
నా దేశం గొప్ప దేశం.
            ****  
మనిషిలో మావతా మాయమై 
మరత్వం పెరిగి అప్యాయతలకు దూరమై 
హార్టిఫీషల్ పువ్వుల్లా అప్పటిమందమే పరిమలించి 
సోషల్ నెట్వర్క్ లో బిజీ అయి 
ఫయిజీ బంధాలకు అతుక్కొని, 
ఆత్మీయ బంధాలను మారుస్తున్న 
నా దేశం గొప్ప దేశం 
           ****  
అవసరాలు పెరిగినకొద్ది 
అయిషు తగ్గించుకొన్న మనిషి 
కాలం ఎరలో పడి, మరలా తిరుగుతూ,
మృగంలా మారుతూ, బతుకులను అమ్ముకొని,
నీళ్ళను కొనుక్కొని తాగుతూ,
యాడ్ లకు ఆకర్షితులై అనవసరపు 
కరిదైనా మందులకు చేసిన 
అప్పుల ఊబిలో కూరుకొని, తేరుకోలేక  
ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతన్నల 
కన్నీటి సాగరంలో కవాతు చేసి, 
పరిష్కారం లేని ఫూల మాలికల ఫోటోకు 
కపటపు దండాన్ని ఇసిరి పారేసే,
నా దేశం గొప్ప దేశం 

ఫీలింగ్స్ లేని ఫ్యాన్స్ ఫాలోయింగుల మత్తులో 
హీరోల నాయకత్వ నాటకరంగంలో
భవిష్యత్తును బజార్ల పడేసి ఎవరికి వారే యనునా తీరే,
ట్విట్టర్లో తిట్లు, ఫెస్బుక్లో పరిచయాలు, 
వాట్సప్ వదంతులు టీవీల్లో గాలిజ్ విశ్లేషణలు అబ్బో
ఏమని చెప్పాలి నా దేశం గొప్ప దేశం. 
             ****  
ఇక్కడ కులం గజ్జి పోవద్దు 
మతం మత్తు తొలగద్దు
మానిన కొద్ది పుల్లబెట్టి గెలుక్కొంటూ
వదిలినకొద్ది కావాల్సుకోని కావలించుకొని,
డేరాల్లో బాబాల విలసాల విందుల పొందుల్లో 
నలిగే నా భారత మాతలను చూస్తూ,
ఎంజాయ్ చేస్తు సిటీలు కొడుతూ,  
ఎంకరేజ్ చేసే నా దేశం గొప్ప దేశం 
            ****  
ఆటల పోటీల్లో గెలిసిన దేశం 
అంటని తనాన్ని గెలవలేక పోతున్నది.
పాటవ పోటీల్లో గెలిసిన, కులాన్ని చూసి, 
చీదరించుకొని, గెలవకుండా చేస్తున్నది.
మంచితనమున్న మనిషిని,
మతం కోరడాలతో కొట్టి చంపుతున్నది.
గోడ్ల మీదున్న మత పైచ్యం నెత్తికెక్కి 
మనుషుల ప్రాణాలను తీస్తున్నది. 
అయిన నా దేశం గొప్ప దేశం.  
            ****  
ఇక్కడ ఎంతో గాలి వృధాగా విస్తున్నది,
ఇక్కడ ఎంతో ఎండ వృధాగా మండుతున్నది,
ఇక్కడ ఎంతో వర్షం కురిసి సాగరంలో కలుస్తున్నది,
ఇక్కడ చెట్లన్నీ ఇగురించకుండా, 
మొగ్గలోనే త్రుంచ బడుతున్నాయి.
ప్రాణ వాయువుకు బదులు విష వాయువు  
పీల్చాల్సి వస్తున్నది.
ఇక్కడి నదుల్లో ఫ్యాక్టరీల 
విష వరదలు, రసాయనిక బురదలు,
ప్లాస్టిక్ కళేబరాలు, సూక్ష్మ జీవుల వీరంగం 
తాగినా, పంటపొలాల్లో పారినా,
జీవరాశికి వింత వ్యాధుల సంచలనం
పత్రికలకు రోజుకో కొత్త వార్తా, 
మీడియాకు సెకండ్కో బ్రేకింగ్ న్యూస్
అధికార దాహంతో, పదవి మొహంతో 
గ్లోబలైజేషన్ కు కరచాలనం చేస్తూ, 
దృతరాష్ట్ర కౌగిలింతల్లో నలిగి 
కొట్టుమిట్టాడుతున్నభారతం
అయినా నా దేశం గొప్ప దేశం .
         ****  
ఇంకా... 
స్వాతంత్ర్యం వచ్చినా, మనిషికి స్వేచ్ఛ లేదు,
మనుషుల్లో సమానత్వం, సోదరత్వం లేదు,
రాజ్యాంగం ఇచ్చినా, హక్కులకు రక్షణ లేదు, 
అధికారం ఇచ్చినా, సీట్ల పై పెద్దరికం లేదు,
నాది నీదని భేదం తో విభజిస్తూ, పాలిస్తూ,
కుతంత్రాలతో కులామధ్య చిచ్చు లేపి, 
మతాల మంటల హోమకుండల్లోకి 
మనుషుల్ని విసిరి పారేస్తున్నారు.   
ఇక్కడ డబ్బూ, కులమున్నోళ్ళదే రాజ్యం.
తప్పును తప్పని చూపిస్తే 
దేశ దూషణ నేరం 
సంఘ విద్రోహక ద్రోహం కేసు 
జైలు గొడల్లో బందీ 
అయిన నా దేశం గొప్ప దేశం. 
         ****  
నాదేశం మతాధిపతుల మత్తులో 
పీఠాధిపతుల చేతుల్లోనే ఉంది.
అధిపత్యపు భావజాల మంటల్లో 
కాలి బూడిదై పోతున్నది. 
మనువు విసిరిన మత్తుల్లో 
తూగుతూ తెలియాడుతుంది. 
దేవుళ్ళ పంచాయితీలు, 
మత గ్రంధాల కాల్చివేతలు,
మంధిరాల కూల్చివేతలు 
సాటి మనిషికన్నా ఎక్కువై 
అపనమ్మకపు ఆహర్భాటాలు

తేదీ: 06.02.2018

Sunday, 15 September 2024

ఇంకా నేను బతికే ఉన్నాను

కనురెప్పల లోయల్ల ఎక్కి 
చెక్కిళ్ల కాలువలపై కారుతున్న 
కన్నీటి జలధారలు 
శోక సముద్రంలో కలిసి 
ఉవ్వెత్తు కెరటాల ఉప్పెనై 
ప్రజ్వలెల్లుతూ 
దిగంతాల జగమంతా 
నిలువునా నింపి చంపుతుంది 
కొంపలు ముంచుతుంది 
కంపనములై కదిలిస్తూంది
ప్రతి తనువును తాకి 
మను కంపిత కంపరపు 
వింతల్లో చోద్యమై 
కులం గోలమై 
వర్ణ పతాకాలెక్కి
మస్తిష్క మతాలపై 
పిలక పతాక రెపరెపలు
వెక్కిరిస్తున్నాయి. 
మూఢాచార నిర్బంధంలో 
ఇంకా నేను బతికే ఉన్నాను.

తేది. 15.09.2024.